'శివ' అనే శబ్దము చాలా గొప్పది.
అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానందరూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీలేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు.
ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుండి తనలోతాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనందస్వరూపమే పరమాత్మ స్వరూపము, నిత్యానందము ఏదివున్నదో దానిని రాశీభూతంచేస్తే అదే 'శివ.'
ఆనందఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానందరూపుడై ఉంటాడు.
ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి.
ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుండి పుడుతున్నాయో అది తానై నిరంజనస్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందఘనమునకు 'శివ' అనిపేరు. అటువంటి ఆనందస్వరూపులుగా మారడమే మనుష్యజన్మ ప్రయోజనము. దానికే మోక్షము అనిపేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలను కుంటున్నవారికి శివుడే ఆరాధ్యదైవము.
ఓం నమః శివాయ
Contribute for Temple Development
Read More
Siva Namam యొక్క గొప్పతనం : శివమహాపురాణంలో దాగి ఉన్న రహస్యాలు (btrkona.online)
0 కామెంట్లు