Siva Namam
'శివ' అనే శబ్దము చాలా గొప్పది.
అమర లింగేశ్వర స్వామి కోన |
శివమహాపురాణము శివశబ్దము తోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానము చేసింది. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.
శివ అన్నమాటను ఏ విధంగా మనం అర్ధం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి.
ఈ జగత్తులో ఉన్న సమస్తప్రాణులకు, సమస్తజీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. కాలములో ఏదయినా వచ్చినట్లయితే దానికి పుట్టిన తేదీ అని ఒకటి వుంటుంది. పుట్టినతేదీ పడినది అంటే అది షడ్వికారములకు లోనయిపోతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి.
![]() |
ఆరు వికారములు |
జీవుడు పుట్టడంతోటే వానికి జన్మము అనే తేదీ కాలములో వచ్చింది. ఒక జన్మతేదీ ఏర్పడింది. అంతకు పూర్వం లేనిది ఇప్పుడు పుట్టినది. ఆ జీవి యిపుడు భూమిపై ఉన్నది. తరువాత ఆ జీవి పెరుగుతుంది. పెరిగి కొంతకాలమునకు మరల తరగడం ప్రారంభిస్తుంది. కొంతకాలమునకు శరీరం వడిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమయి పోతుంది. ఇంకా కొంతకాలం గడిచేసరికి ఆ శరీరం నశించిపోతుంది. ఈ ఆరు వికారములు సమస్తప్రాణులకు ఉండితీరుతాయి.
ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా?
ఉన్నది. అదే 'శివ'.
![]() |
అమర లింగేశ్వర స్వామి |
అది కాలములో పుట్టలేదు. కాలములో పెరగలేదు. కాలములో ఉండలేదు. కాలములో నశించదు. ఎవరినుండి వచ్చినదో, ఎవరియందు పెరిగినదో, ఎవరియందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయినవాడు ఎవడు? వాడు పరబ్రహ్మము. వానికి కదలికలేదు. వాడు ముందరా ఉన్నాడు - చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. వానికి వికారములు లేవు, కాబట్టి వాని జుట్టు తెల్లబడదు. వానికి ముసలితనం లేదు. వానిని కాలము లొంగదీయలేదు. కాబట్టి వాడు నిత్యయౌవనుడు. అందుకే మనం శివుని గురించి చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా -
వారికి వార్ధక్యము రాదు. ఎందుచేత? కాలస్వరూపములో మీయందు మార్పులు తెచ్చేవాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడిగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమైవున్నదో అది ఆధారమై ఉన్నది. దానియందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయిస్తున్నది. అటువంటిది ఏదో అది వికారాతీత స్థితి కలిగిన పరబ్రహ్మము. దానిని ఒక నామవాచకముతో పిలవాలని అనుకుంటే 'శివ' అని పిలువవచ్చు. కాబట్టి ఇప్పుడు శివశబ్దము పరబ్రహ్మము గురించి చెపుతోంది.
ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కాని వికారము చెందుతున్న జగత్తుకు ఆధారముగా వున్నవాడు మీ కళ్ళకు కనపడడు.
0 కామెంట్లు